‘డ్వాక్రా మహిళల’ మాస్క్ ధరించిన సీఎం జగన్.. ముందు ఆ ప్రాంతాల వారికి పంపిణీ!

మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ మాస్కులను అందచేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ స్వయంగా మాస్క్ ధరించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, మెప్మా అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి పాల్గొన్నారు


కాగా, కరోనా వైరస్‌ నుంచి రక్షణ కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరికీ మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రజలకు పంపిణీ చేసే 16 కోట్ల మాస్కులను మెప్మా ఆధ్వరంలో డ్వాక్రా మహిళలే తయారు చేశారు. సుమారు 5.3 కోట్ల మందికి ఒక్కొక్కరికీ మూడు చొప్పున 16 కోట్ల మాస్కులు అందచేయనున్నారు.కాగా, రాష్ట్రంలో గుర్తించిన రెడ్‌ జోన్లలో ఈ మాస్కులను ముందస్తుగా పంపిణీ చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు వివరించారు. ఆ తర్వాత అన్ని ప్రాంతాల్లో సరఫరా చేస్తామని చెప్పారు. ప్రతి వ్యక్తికి 3 చొప్పున మాస్కులు పంపిణీ చేస్తామని చెప్పారు. దీనికి సీఎం జగన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.